AP Excise Bar Policy: ఏపీ ఎక్సైజ్ శాఖ తాజాగా విడుదల చేసిన కొత్త బార్ పాలసీకి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ఐదు రోజుల్లో కేవలం 19 దరఖాస్తులే వచ్చాయి. మొత్తం 250 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినప్పటికీ.. వారిలో కేవలం 19 మంది మాత్రమే రూ.5 లక్షలు చెల్లించి తుది దరఖాస్తులు సమర్పించారు. అయితే, ఒక్కో బార్‌కు అధికంగా ఉన్న రూ.5 లక్షల ఫీజే ఈ తక్కువ స్పందనకు కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ డ్రా ఉంటుందన్న నిబంధనపై బార్ల యజమానులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read Also: కేవలం రూ.5,999లకే ఇన్ని ఫీచర్స్ ఏంటయ్యా..? కొత్త Itel Zeno 20 లాంచ్!
ఇక, ఈ వ్యతిరేకతలతో దరఖాస్తులు రాని పరిస్థితిలో.. లాటరీ జరగకపోతే ఫీజు తిరిగి ఇస్తామని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. దరఖాస్తుల లేమితో పాలసీలో ఎక్సైజ్ శాఖ పలు మార్పులు చేసింది. దరఖాస్తు గడువులను కూడా ఖరారు చేసింది. ఓపెన్ కేటగిరీ దరఖాస్తుల చివరి తేదీ ఆగస్టు 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంది. కాగా, ఓపెన్ కేటగిరీ లాటరీ డ్రా ఆగస్టు 28వ తేదీన నిర్వహించనున్నారు. అలాగే, రిజర్వ్ కేటగిరీ దరఖాస్తుల చివరి తేదీ ఆగస్టు 29 సాయంత్రం 5 గంటల వరకు ఉండగా.. రిజర్వ్ కేటగిరీ లాటరీ డ్రా ఆగస్టు 30న జరగనుంది. మొత్తంగా, నూతన బార్ పాలసీకి తక్కువ స్పందన రావడంతో.. ఏపీ ఎక్సైజ్ శాఖ లాటరీ నియమాల్లో పలు మార్పులు చేస్తూ.. దరఖాస్తుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.