Loan Scam In DCCB Vinukonda Branch: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. వడ్డీల రాయితీలు, రుణాల కిస్తీలు, లబ్ధిదారుల పేరిట రుణాలను స్వాహా చేయడంలో.. బ్యాంకు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి అక్రమాలు తరచూ వెలుగు చూస్తున్నప్పటికీ.. అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. తూతూమంత్రపు చర్యలతో సరిపుచ్చుతున్నారు. ఇదే అదునుగా అక్కమార్కులు రెచ్చిపోతున్నారు. తమకు అడ్డు చెప్పేవారు లేకపోవడంతో.. అవినీతికి పాల్పడుతున్నారు. రీసెంట్‌గానే.. పొన్నూరులో ఒక బ్యాంక్ ఉద్యోగి, రైతులకు ప్రభుత్వమిచ్చే వడ్డీ రాయితీ సొమ్ముని తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఈ ఘటన మరువకముందే.. తాజాగా వినుకొండ బ్రాంచ్‌లో ఓ ఉద్యోగి డ్వాక్రా రుణాలను తన ఖాతాలోకి వేసుకున్న సంఘటన తెరమీదకి వచ్చింది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. వినుకొండ బ్రాంచ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కీలక బాధ్యతల్లో ఉన్నాడు. అతడు డ్వాక్రా గ్రూపుల పేరిట పోర్జరీ సంతకాలతో రుణాల్ని దరఖాస్తులు చేసేవాడు. వాటికి రుణాలు మంజూరు అవ్వగానే.. ఆ సొమ్మంతా తన ఖాతాకు, అలాగే తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి జమ చేసుకుంటూ వచ్చాడు. రన్నింగ్ రుణాల పేరుతో కొత్త రికార్డులను తన పరిధిలోనే ఉంచుకుని.. రెండేళ్ల పాటు ఈ కుంభకోణం కొనసాగించాడు. తన స్కామ్ బయటపడకుండా ఉండేందుకు, ప్రతి మూడు నెలలకోసారి కొంత సొమ్మును నమోదు చేస్తూ వచ్చాడు. అయితే.. ఇటీవల నాబార్డు ఆడిటర్ల హెచ్చరికతో బ్రాంచ్ నోడల్ అధికారులు డ్వాక్రా రుణాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఆ ఉద్యోగి కుంభకోణం బయటపడింది. దీంతో నాలుగు రోజుల నుంచి అధికారులు గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్‌గా రికార్డుల్ని తనిఖీ చేస్తున్నారు.
ఈ కుంభకోణంపై బుధవారం గుంటూరు ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.చైర్మన్ లాల్‌పురం రాము, పాలకవర్గ సభ్యులు నాయక్, కోట హరిబాబు, వెంకటేశ్వరరావులు సీఈవో కృష్ణవేణి, జీఎం భాను, డీజీఎంలు ఫణి, అజయకిషోర్‌తో సమీక్షించారు. మరోవైపు.. డ్వాక్రా రుణాల పంపిణీలో అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులతో ఇప్పటికే ఇద్దరు మేనేజర్లను బదిలీ చేశారు.