ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న జవాద్ తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైయింది. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అధికారులకు, ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈనెల మూడో తేది నుంచి మూడు రోజులపాటు పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు సందర్శకులు రావొద్దని సూచించింది. మత్స్యకారుల వేటకు వెళ్లడంపైన నిషేధం విధించారు.
ఆయా ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కలెక్టరేట్, జీవీఎంసీ,సబ్ కలెక్టర్, సబ్ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. +91 90102 34017: విశాఖ జిల్లా వారు ఈనెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. తుఫాన్ ఎఫెక్ట్ తో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకు విధులకు హాజరుకావాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జవాద్ తుఫాన్‌ను ఎదుర్కొవడానికి అధికార యంత్రాంగం పూర్తి సమాయత్తంగా ఉందని మంత్రి తెలిపారు. రెవెన్యూ,జీవీఎంసీ అధికారులు యాక్షన్ ప్లాన్‌తో రెడీగా ఉన్నారన్నారు. ప్రత్యేకాధికారిని కూడా నియమించామని తెలిపారు. రైతులకు ముందస్తు సూచనలు చేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఆయన తెలిపారు.