Lakshmi Parvathi: తన పెళ్లిపై వ్యక్తిగత కామెంట్లు చేసేవారిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సంఘటన జరిగినా తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చరిత్ర చెరిపితే చెరిగిపోదని.. ఎన్టీఆర్‌ను తాను పెళ్లి చేసుకోవడం చంద్రబాబుకు ముందు నుంచీ ఇష్టం లేదన్నారు. తమ వివాహ ప్రకటనను అడ్డుకోవటానికి చంద్రబాబు మైక్ వైరులు కట్ చేసి లైట్‌లు ఆఫ్ చేసి నానా బీభత్సం చేశాడని.. అందరి సమక్షంలో జరిగిన తమ వివాహం గురించి ఎవరైనా అనుచితంగా వ్యాఖ్యానిస్తే కేసు పెడతానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భార్య పదవికి మించి మరో పదవి తనకు పెద్దది కాదని తెలిపారు.
Read Also: Maa Robot: దివ్యాంగులైన కుమార్తె కోసం దినసరి కూలీ సరికొత్త ఆవిష్కరణ
ఎన్టీఆర్‌కు అనారోగ్యం, పిల్లలకు ఆస్తుల పంపకాలు, అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో తాను ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చానని.. తాను వచ్చిన తర్వాత ఆరోగ్యమే కాదు అధికారం కూడా తిరిగి వచ్చిందని లక్ష్మీపార్వతి వివరించారు. అప్పట్లో చంద్రబాబు చేసిన దుర్మార్గానికి కుటుంబసభ్యులు వంత పాడారని తెలిపారు. అల్లుళ్ల కొట్లాట వల్లే 1989 ఎన్నికల్లో ఓడిపోయామని అప్పట్లో ఎన్టీఆర్ తనకు చెప్పారన్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించేందుకు తనపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలను నమ్మవద్దని లక్ష్మీపార్వతి కోరారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కొన్ని మీడియా సంస్థలు కించపరుస్తున్నాయని.. వాస్తవాలు ప్రజలకు తెలియాలనే తాను మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీ కంటే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడమే గొప్ప విషయమని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ హంతకులకు ఆయన పేరు ప్రస్తావించే అర్హత లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్నించారు.
తాను రాజ్యాంగేతర శక్తిగా ఉన్నాననే భ్రమను చంద్రబాబు ఆనాడు కలిగించే ప్రయత్నం చేశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. తాను ఏ ఒక్క చిన్న తప్పు చేసి ఉన్నా.. ఆ తర్వాత చంద్రబాబు తనను వదిలి ఉండేవాడా అని నిలదీశారు. చంద్రబాబు దుర్మార్గుడు అని ఆ రోజే ఎన్టీఆర్ అన్నారన్నారు. చంద్రబాబును క్షమించమని తాను ఎన్టీఆర్‌ను అడిగితే పాముకు పాలు పోసి పోషిస్తున్నావు అని ఎన్టీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు.