KVP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఏపీలోకి ప్రవేశించనుంది. కర్ణాటక సరిహద్దు మోక వద్ద ఏపీలో ప్రారంభం కానుంది. ఏపీలో నాలుగు రోజుల పాటు 90 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు భారత్ జోడో యాత్ర నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, దిగ్విజయ్ సింగ్, ఉమెన్ చాందీ కర్నూలు జిల్లా నేతలతో సమీక్షించారు.
Read Also:Nobel Prize 2022: భౌతికశాస్త్రంలో ఆ ముగ్గురికి నోబెల్ పురస్కారం
ఈ సందర్భంగా ఎన్టీవీతో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు మాట్లాడారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర చాలా బాగా జరుగుతోందని కేవీపీ అన్నారు. ఈ యాత్ర సన్నాహక సమావేశానికి కాంగ్రెస్ కార్యకర్తలు కర్నూలు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తరలిరావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారత్ జోడో యాత్ర కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంతో కనిపిస్తున్నారని కేవీపీ అన్నారు. కర్ణాటక తరహాలో జరగకపోయినా ఏపీలో కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో భారత్ జోడో యాత్ర చక్కగా నిర్వహిస్తామన్న నమ్మకం ఉందన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడుతున్నాడని.. ప్రతి కార్యకర్త కష్టాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తూ భారత్ జోడో యాత్రను దిగ్విజయం చేయబోతున్నారని కేవీపీ వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల తరహాలో ఏపీలో భారత్ జోడో యాత్ర సక్సెస్ గురించి తనకు ఎలాంటి అనుమానాలు లేవని కేవీపీ స్పష్టం చేశారు.