Kurnool Bus Accident: కర్నూలు బస్ దగ్ధం ఘటన లో రెండవ కేసు నమోదు అయింది. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఫిర్యాదు చేయగా.. శివ శంకర్ పై కేసు నమోదు చేశారు. 281,125(A), 106(1) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. తాను, శివ శంకర్ మద్యం సేవించినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి పేర్కొన్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనింది.. శివ శంకర్ స్పాట్ లో చనిపోయాడు.. నేను గాయాలతో బయట పడ్డాను అని చెప్పుకొచ్చారు. అయితే, అతడి డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. తమ బైక్ ను మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది.. దీంతో బస్సు బైకును లాక్కెళ్లిందని ఎర్రిస్వామి వెల్లడించాడు.
Read Also: Yugani Kokkadu 2 : యుగానికొక్కడు 2’పై సెల్వ రాఘవన్ షాకింగ్ కామెంట్స్
మరోవైపు, కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీఏ అధికారులు తనిఖీలు వేగవంతం చేశారు. నంద్యాల జిల్లాలో 66 కేసులు పెట్టి రూ. 28,400 ఫైన్ వేయగా.. పల్నాడు జిల్లాలో 36 కేసులు పెట్టి రూ. 2,50,700 జరిమానా విధించారు. ప్రకాశం జిల్లాలో 34 కేసులు పెట్టి రూ. 89,810 ఫైన్ వేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లాలో 25 కేసులు పెట్టడంతో పాటు రూ. 2,40,000 జరిమానా వేసినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో 8 కేసులు పెట్టి రూ. 2,32,100 ఫైన్, కర్నూలు జిల్లాలో 14 కేసులు పెట్టి 72,050 ఫైన్ వేసి, మోటార్ వెహికల్ ట్యాక్స్ 96,000 అధికారులు కలెక్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 42 కేసులు పెట్టి ఒక బస్సు సీజ్ చేయగా, అన్నమయ్య జిల్లాలో 21 కేసులు పెట్టి 6 బస్సులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 కేసులు పెట్టి 3 బస్సులు సీజ్ అయ్యాయి. కృష్ణా జిల్లాలో 8 కేసులు పెట్టి 4 బస్సులు సీజ్ చేశారు.