పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు. నిర్మలమ్మ బడ్జె్ట్ సంతృప్తి నివ్వలేదన్నారు. బడ్జెట్‌లో ఏపీ కంటే బీహార్‌కే ఎక్కువ కేటాయింపులు జరిగాయన్నారు. 12 ఎంపీ సీట్లు ఉన్న జేడీయూ.. బీహార్ కోసం ఎంతో సాధించింది. అంతకంటే ఎక్కువ సీట్లు ఉన్న ఏపీ మాత్రం ఏమి సాధించలేకపోయిందని ధ్వజమెత్తారు. 16 సీట్లతో మీరేమి సాధించారని కూటమి సర్కార్‌ను ప్రశ్నించారు. అప్పు తెచ్చి పండగ చేసుకోవడం ఎక్కడా చూడలేదని బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు.
‘‘గతంలో విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం ట్యాబ్ ఇస్తే విమర్శించారు. బడ్జెట్‌లో విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మెడికల్ సీట్లు కేంద్రం 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. వైసీపీ హయాంలో 2,500 ఏపీలోనే ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇపుడు ఆ కాలేజీ నిర్మాణాలు నిలిపివేయాలని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. ఆదాయపు పన్ను రూ.12 లక్షల వరకు మధ్య తరగతికి మినహాయించడం మంచి పరిణామం. కేంద్రానికి చంద్రబాబు అవసరం ఉంది.. గతంలో వైసీపీ మద్దతు కేంద్రానికి అవసరం లేదు. ఇప్పుడు టీడీపీ 16 సీట్లు బీజేపీకి అవసరం ఉంది. అయినా ఒక్కటి కూడా చంద్రబాబు సాధించలేకపోయారు. పోలవరం ప్రాజెక్టు135 మీటర్ల వరకు పూర్తి చేయడానికి అంగీకరించినట్టు అర్థం వచ్చేలా ఉంది. 150 మీటర్లు నిర్మిస్తేనే పోలవరం ప్రాజెక్టు ఉపయోగం ఉంటుంది.’’ అని బుగ్గన అన్నారు.
‘‘తలసరి ఆదాయం తగ్గిందని చంద్రబాబు అంటున్నారు.. రాజకీయంగా ఉపయోగపడచ్చు… రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. వాల్మీకి చెట్టుకొమ్మను కొట్టుకున్నట్టు చేస్తున్నారు చంద్రబాబు. కేంద్ర బడ్జెట్ బాగున్నవాటికి మేము కూడా థాంక్స్ చెబుతున్నాం. ఏపీకి ఏమి సాధించారు. స్టీల్ ప్లాంట్‌కి పెట్టుబడి సాయం మాత్రమే కాదు…సొంత గనులు కావాలి.’’ అని బుగ్గన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Thandel Jathara :”తండేల్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్.. వేదిక ఖరారు.. వారికి మాత్రం నో ఎంట్రీ..
శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో యూనియన్ బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టారు. ఈసారి రూ.50,65,345 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించబడింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వివిధ రంగాలకు మరింత మద్దతుగా ఈ నిధులను కేటాయించారు. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఐటీ, పట్టణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక రంగాలు వంటి ముఖ్యమైన శాఖలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు.
స్వాగతించిన చంద్రబాబు
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప విషయం అని కొనియాడారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ దార్శనికతకు బడ్జెట్ ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని కితాబు ఇచ్చారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది