TDP vs YSRCP: గన్నవరంలో మరోసారి తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి మారిపోయింది.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గన్నవరం మండలం మర్లపాలెం గ్రామంలో వైసీపీ క్యాడర్‌పై దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కలిశారన్న అక్కసుతో ఇద్దరు వ్యక్తులపై దాడి జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడికి టీడీపీకి చెందిన వ్యక్తులే పాల్పడ్డారని వారు చెబుతున్నారు.
Read Also: Sydney Terror Attack: నిందితులు పాక్‌కు చెందిన తండ్రీకొడుకులుగా గుర్తింపు.. ఐసిస్ జెండా స్వాధీనం!
సమాచారం మేరకు, మధ్యాహ్నం సమయంలో ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు వల్లభనేని వంశీ మర్లపాలెం గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన కంభంపాటి శ్రీధర్, కంభంపాటి రామ్మోహనరావు.. వల్లభనేని వంశీ మోహన్‌ను కలిశారు. అయితే, వంశీని కలిసిన కారణంగానే వీరిద్దరిపై కక్ష పెంచుకున్న కొందరు వ్యక్తులు హాకీ స్టిక్స్‌తో దాడికి పాల్పడ్డారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దాడిలో శ్రీధర్, రామ్మోహనరావులకు తల, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని పిన్నమనేని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉంది.