AP Deputy CM Pawan: కృష్ణా జిల్లాలోని కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేలకొరిగిన వరి పంట పొలాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి దెబ్బ తిన్న వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో పంట నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ తో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు.
Read Also: Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యుడి వ్యాఖ్యలపై భాను ప్రకాష్ రెడ్డి ఫైర్
అలాగే, తుఫాన్ కారణంగా నష్టపోయామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రైతులు తెలిపారు. ఎకరానికి 30 వేల రూపాయలు ఖర్చు అయ్యింది.. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఇటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంది.. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నాం.. కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది అన్నారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు సాయం అందేలా చూడాలని వేడుకున్నారు. రెండు మూడు రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పవన్ కి కలెక్టర్ బాలాజీ వివరించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం.. ఎవరూ ఆందోళన చెందకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
అయితే, ముందస్తుగా తీసుకున్న చర్యలతో నష్ట నివారణ కొంత వరకు తగ్గించామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. చంద్రబాబు ముందు చూపు కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.. ప్రజలకు ఎలర్ట్ మెసేజులు కూడా పంపాం.. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగింది.. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం బాగా పని చేశారు.. 46 వేల హెక్టార్లలో వరి, 14 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బ తిన్నాయి.. కోయ సుబ్బారావు చెట్టు మీద పడి చనిపోవడం బాధాకరం అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు బియ్యం ఉచితంగా ఇస్తున్నాం.. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాం.. ఇళ్లకు వెళ్లే సమయంలో కూడా ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఇక, డ్రైన్ల పూడిక తీతల ద్వారా నీరు నిల్వ లేకుండా చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ పేర్కొన్నారు. మండలి బుద్ధప్రసాద్ చెప్పిన సమస్యలు పరిష్కరిస్తాం.. ముందస్తుగా తీసుకున్న చర్యలు వల్ల నేడు నష్టం చాలా వరకు తగ్గింది.. ఆక్వా రైతులు ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి.. సీఎంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో రోడ్లు పాడైతే యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తాం.. రెండు రోజుల్లో మొత్తం చెత్తను క్లీన్ చేసేలా వేలాది మంది సిబ్బంది పని చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.