Kottu Satyanarayana Review Meeting In Simhachalam: టీడీపీ హయాంలో ఆక్రమణలు విపరీతంగా జరిగాయని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపణలు చేశారు. సింహాచలంలో సమీక్ష నిర్వహించిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పదాలు ఇప్పుడు దేవదాయ శాఖకు తలనొప్పిగా మారాయని వ్యాఖ్యానించారు. సింహాచలం భూముల పరిరక్షణపై తాము పూర్తి దృష్టి పెట్టామని.. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కొంత నష్టం జరిగిందని స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానం పరిధిలో 18 బీట్లు ఉన్నాయని.. ఇకపై ఆక్రమణలు జరిగితే ఆ ప్రాంత అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. పంచగ్రామ భూ సమస్య ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని.. భూ సమస్య విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. నృసింహ యాగం క్రమం తప్పకుండా జరిగేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
అంతకుముందు.. ఏపీలోని అన్ని దేవాలయాల్లో త్వరలోనే ‘టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టం’ ద్వారా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని సత్యనారాయణ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 175 దేవాలయాల్లో పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని.. ఈ విధానం ద్వారా దర్శన టికెట్లు, పూజలు, కానుకలు తదితర సేవలన్నీ ఆన్‌లైన్ ద్వారా పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 16 దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని.. రాష్ట్రంలోని మరో 185 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల పథకం మంజూరు చేయనున్నారని పేర్కొన్నారు. ఆలయాలకు వచ్చే ఆదాయం, వ్యయాలు, ఇతర రాబడులపై కూడా.. పటిష్టమైన ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్‌ను తీసుకురానున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.