విజయనగరం జిల్లాలో నేడు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణెదల నాగబాబు పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. జనసేనా ఫ్యామిలీ చూడడానికి… వాళ్ల అభిప్రాయం తెలుసుకోవడంతో పాటు అవగాహన పెంచుకునేందుకు వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో కూర్చొని ఎవ్వరో చెప్పింది తెలుసుకునే కంటె నేరుగా వచ్చి తెలుసుకోవాలనుకున్నానని ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ పర్యటన ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి తెలుసుకొనే అవకాశం వచ్చిందన్నారు నాగబాబు.
కార్యకర్తలలో మంచి జోష్ ఉందని, నియోజకవర్గం సమస్యల చాలా లేవనెత్తారని ఆయన అన్నారు. నాయకులలో చిన్నచిన్న విభేదాలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా ఖనిజ సంపద ఉంది… చాలా మంది దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్రలో మరీ ఎక్కువ ఖనిజ సంపదుందని, ప్రజల కోసం ప్రస్తుత నాయకులు పనిచేయడం లేదు.. ఖనిజ సంపద కోసమే పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో వలసలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.