రాజకీయాల్లో క్రెడిట్ హైజాకింగ్ పాలసీ అని ఒకటి వుంటుంది. తమ నిర్ణయాల వల్ల అంతా మంచి జరిగితే ఆ క్రెడిట్ అంతా మావల్లే జరిగిందని, తప్పు జరిగితే అది విపక్షాల కుట్ర అని నెపం నెట్టేయడం అన్నమాట. ఏపీలో అదే జరుగుతోంది. ప్రశాంతంగా వుండే కొనసీమ రణసీమగా మారింది. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. కోనసీమ జిల్లా పేరును మార్చవద్దంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మంగళవారం అవి కాస్త హింసాత్మకంగా మారాయి. గుంపులుగా వచ్చిన ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటిని తగులబెట్టడం విమర్శలకు దారితీసింది. అలాగే ముమ్మిడవరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై కూడా దాడి చేయడం, పోలీసులు కూడా వందలాదిమంది గాయాల పాలవడం ఎవరూ సమర్థించే వ్యవహారం కాదు.
మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డా.బీఆర్ అంబేద్కర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు హోంమంత్రి తానేటి వనిత. అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమన్నారు. కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమగా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాని ఆమె సూచించారు. అయితే ఈ గొడవలు, విధ్వంసాల వెనుక టీడీపీ, జనసేన హస్తం వుందని వైసీపీ నేతలు, మంత్రులు ప్రకటించడంపై ఆయా పార్టీలు మండిపడుతున్నాయి. ఏ ఆధారాలతో ఆ ఆరోపణలు చేశారో చెప్పాలంటున్నాయి. హోంమంత్రి తానేటి వనిత కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీని వెనుక టీడీపీ, జనసేన పార్టీలున్నాయన్న అనుమానం ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయి. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నా అన్నారు.
ఇటు హోంమంత్రితో పాటు మంత్రి విశ్వరూప్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా టీడీపీ, జనసేనల హస్తంపై వ్యాఖ్యలు చేశారు. ‘నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్ చేశాయి. అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన నిరసనలు కూడా చేసింది. అయితే ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు చేస్తున్న కుట్రలన్నారు మంత్రి విశ్వరూప్.
ప్రజల విజ్ఞప్తి మేరకే కోనసీమకు డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టారని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. కొన్ని సంఘవిద్రోహ శక్తులు అశాంతిని రేకేత్తించాయి. ఈ ఘటనలతో నేను సిగ్గుపడుతున్నా. చంద్రబాబు సైతం అంబేడ్కర్ జిల్లా పేరు పెడతా అని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మీడియా ముందుకు రావాలి. వెనక ఉండి రెచ్చగొట్టడం మానుకోవాలి.బయట ఒక మాట లోపల ఒక మాట చెప్పకూడదు. పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు. అంబేడ్కర్ పేరు పెట్టుకోవడం మన అదృష్టం. ఉద్యమకారులు సంయమనం పాటించాలన్నారు. ఏ శక్తులు కుట్రలు పన్నాయో తెలియడం లేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తే ఎవరినీ ఉపేక్షించకూడదు. ఈ ఘటనలపై విచారణ జరిపాక ఒక నిర్ణయానికి రావాలి. ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి టీడీపీపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ పోలీసుల, ప్రభుత్వ వైఫల్యం అని చంద్రబాబు అన్నారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని చంద్రబాబు కోరారు.
కోనసీమలోని అమలాపురం ఘటనలపై బీజేపీ నేత సోము వీర్రాజు స్పందించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇటు అమలాపురం దాడులను పవన్ కళ్యాణ్ ఖండించారు. పాలనా పరమయిన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ ఘర్షణలను ఇతర పార్టీలకు ఆపాదిస్తున్నారని పవన్ దుయ్యబట్టారు. ఈ గొడవలు చేసేది జనసేన అన్న హోంమంత్రి ప్రకటనను పవన్ ఖండించారు. అంబేద్కర్ పేరుని వివాదాల్లోకి లాగిందే ప్రభుత్వమే అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.
ఇంతమంది వచ్చి ఆందోళన చేస్తారని సమాచారం వుంటే.. పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది. 144 సెక్షన్ పకడ్బందీగా అమలుచేసి వుండాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వేలాదిమంది ఆందోళన చేస్తే వారిని ఆపడం పోలీసుల వల్ల కాదు. కోనసీమ ఆందోళనలను ప్రభుత్వం లైట్ తీసుకుందా? ఇంత దూరం వస్తుందని ఊహించి వుండదంటున్నారు. బీఆర్ అంబేద్కర్ పేరుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆందోళనకారులు ఇప్పటికైనా స్పష్టం చేస్తే బాగుంటుంది.లేదంటే రాజ్యాంగనిర్మాత పేరుమీద ఏర్పడిన జిల్లాను వ్యతిరేకించడం, హింసకు పాల్పడడం ఎవరూ క్షమించరు. ఆందోళనకు గల కారణాలను అన్వేషించాలి. ఇతర పార్టీల మీద నెపం నెట్టేస్తే మచ్చ చెరిగిపోదు. ఘటనకు కారణమయిన వారిని సభ్యసమాజం ముందు నిలబెడితే ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది. ఎవరిమీదో బట్ట కాల్చి పడేస్తే కుదరదు. ఇలాంటి వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలంటే..ఈ హింసాత్మతక ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం వుంది.
మరోవైపు కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో హోంశాఖ అప్రమత్తమైంది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు జిల్లాకు అదనపు బలగాలను పంపింది. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆందోళనకారులను నిలువరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలయ్యేలా చర్యలు చేపట్టారు.