YCP MLA Kolusu Parthasarathy countered on the remarks made by TDP leader Atchannaidu.
ఏపీలో వైసీపీ నేతలకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైసీపీపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేశారని ఆయన ఆరోపించారు. వాళ్లు తాబేదార్లకు లాభం చేకూర్చేలా దోచుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత 90 శాతం మేనిఫెస్టో అమలు చేసిన మాపై ఛార్జ్ షీట్ వేస్తారట.. అదీ ఈఎస్ఐ స్కాం చేసిన అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్ వేస్తాడట అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
అంతేకాకుండా చంద్రబాబు 5 ఏళ్లలో చేసిన పాపానికి జనం చీదరించినా సిగ్గురాలేదని, అధికారంలోకి వచ్చిన మొదటి రోజునుంచి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన దానిపై చర్చించటానికి మేం సిద్ధమన్నారు. హామీలను అమలు చేయకుండా తప్పించుకుపోయిన చంద్రబాబు సిగ్గులేకుండా ఛార్జ్ షీట్ వేస్తాడా..? అని ఆయన ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలు దేహీ అని అడుక్కునే పరిస్థితి కల్పించారని, మధ్యలో దళారులు ఉండకూడదని నేరుగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరుస్తున్నది జగన్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రోజు ఎస్సీ, బీసీ, మహిళలను కించపరిచిన వ్యక్తి చంద్రబాబు అని, మేం వాళ్ళ అభ్యున్నతికి చట్టాలు చేసి రిజర్వేషన్లిస్తే మాపై ఛార్జ్ షీట్ వేయడానికి సిగ్గులేదా…? అధికారంలో ఉన్నప్పుడు ఏ పేదవారికైనా ఇళ్లస్థలం ఇచ్చావా…? అని ఆయన అన్నారు.