మరోసారి తెలుగుతమ్ముళ్లపై తీవ్ర స్థాయిలో కొడాలినాని విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ పై ధ్వజమెత్తారు. ఎవ్వరరూ ఏమనుకున్నా ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆయన వెల్లడించారు. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ చేపట్టామని ఆయన అన్నారు. విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు. అమరావతి కూడా ఉంటుందని నాని వ్యాఖ్యానించారు.
కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధాని అమరావతిని టీడీపీ ఏర్పాటు చేసిందని ఆయన ఆరోపించారు. అమరావతి అందరిది అంటున్న టీడీపీ పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకోవడం మానేయాలని నాని అన్నారు. రైతుల పేరుతో యాత్ర చేస్తున్న వారు తమ స్వప్రయోజనాల కోసమే యాత్ర చేస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చామని ఆయన అన్నారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు రావొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని దీన్ని స్వాగతించాల్సింది పోయి టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని కొడాలి నాని అన్నారు.