NTV Telugu Site icon

Kodali Nani: కేసీఆర్ ‘బీఆర్ఎస్’ పార్టీపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

Kodali Nani

Kodali Nani

Kodali Nani: తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ మ‌నుగ‌డ‌కు కాల‌మే స‌మాధానం చెప్పాల‌ని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్నారు. ఇప్పటికే రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్ ప్రధాని కావాలని ఆరాటపడుతున్నారేమోనని కొడాలి నాని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలు కేసీఆర్‌ను వ్యతిరేకించారని.. అయితే ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్‌లో సెటిలైన ఆంధ్రా వాళ్లు టీఆర్ఎస్ పార్టీని అభిమానించారని కొడాలి నాని గుర్తుచేశారు. ఇప్పటికీ ఏపీలో కేసీఆర్‌పై వ్యతిరేక భావన ఉందని.. అది ఎంత మాత్రం ఉంది.. ఆయన పార్టీకి ఏపీలో క్యాండిడేట్లు దొరుకుతారా అన్న విషయాలపై కాలమే సమాధానం చెప్పాలని కొడాలి నాని అన్నారు. ఎవరైనా, ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు అని తెలిపారు. చంద్రబాబు తెలంగాణలో పోటీ చేసి జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు.. కేసీఆర్ ఏపీలో ఎందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు.

Read Also: Botsa Satyanarayana: ఈనెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేయాలి

అటు అమ‌రావతి ఉద్యమంపైనా కొడాలి నాని స్పందించారు. అమాయకులైన అమరావతి రైతుల ముసుగులో కమ్మ కుల ఉగ్రవాదులు పాదయాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓడిపోయిన 10 మంది కమ్మ టీడీపీ నేతలు తనను కుల బహిష్కరణ చేయడానికి గుడివాడలో తొడలు కొట్టారంటూ కొడాలి నాని చురకలు అంటించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆయ‌న సోద‌రుడు చిరంజీవి మద్దతు అవ‌స‌రం రాక‌పోవ‌చ్చని.. కానీ 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు మ‌ద్దతు ఉంటే చాల‌ని ఎద్దేవా చేశారు. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో చంద్రబాబు చెప్తున్న మాటలన్నీ ట్రాష్ అని కొడాలి నాని కొట్టిపడేశారు. 200 ఏళ్లు అయినా అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి కాద‌ని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.

Show comments