Kashibugga Stampade: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. భక్తుల రద్దీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, 94 ఏళ్ల వృద్ధుడు స్వంత ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. “ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు,” అని చెప్పారు.
కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం గర్భగుడి మొదటి అంతస్తులో ఉంది. భక్తులు దాదాపు 20 మెట్లు ఎక్కి దర్శనానికి వెళ్తుంటారు. శనివారం భక్తుల రద్దీ పెరగడంతో మెట్లపై ఉన్న రెయిలింగ్ ఒక్కసారిగా ఊడిపడింది. రెయిలింగ్ పడుతుందేమోనన్న భయంతో భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది మహిళలు, ఒక బాలుడు మృతిచెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మ, పట్టిలసారి గ్రామానికి చెందిన రాపాక విజయ, వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ, మందసకు చెందిన రాజేశ్వరి, బృందావతి, నందిగాం మండలానికి చెందిన యశోదమ్మ, సోంపేటకు చెందిన నిఖిల్, పలాసకు చెందిన అమ్ములు ఉన్నారు. గాయపడినవారిని పలాస, టెక్కలి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా మాట్లాడుతూ, సాధారణంగా రోజుకు రెండు వేల మంది భక్తులు వస్తారని, కానీ శనివారం సుమారు 25 వేల మంది రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు.
“ఇంత మంది వస్తారని ముందుగానే తెలిసి ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చేవాణ్ణి. దర్శనానికి వెళ్లే క్యూలైన్, తిరిగి వచ్చే మార్గం ఒకటే కావడం ప్రమాదానికి దారితీసింది,” అని ఆయన వివరించారు. అధికారులు కూడా నిర్మాణ పనులు కొనసాగుతుండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేసి ఉంటే ఈ దుర్ఘటన తప్పించుకునేదని తెలిపారు.