ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులకు నేరుగా అందేలా చేసే ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని మాత్రమే మహిళలకు మంజూరైన పది కోట్ల రూపాయల వడ్డీ రాయితీ చెక్కును మహిళలకు అందజేశారు.
మహిళా లబ్ధిదారులతో కలిసి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు హామీ ఇవ్వని పథకాలను కూడా సీఎం జగన్ సమర్థంగా అమలు చేస్తున్నారని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఐదేళ్ల కాలంలో తణుకు నియోజకవర్గంలో 207 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేస్తే తమ ప్రభుత్వ హయాంలో రెండు సంవత్సరాల పది నెలల కాలంలో 878 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని మంత్రి చెప్పారు.
మన రాష్ట్రంలో ఇంటింటికి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తితో పరిశీలిస్తున్నారని మంత్రి కారుమూరి అన్నారు. మూడుసార్లు దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గుర్తింపు పొందారని మంత్రి కారుమూరి గుర్తుచేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు కార్యకర్తలు డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: Leaders Variety Route: వైసీపీలో ఆ ఇద్దరు నేతల తీరే సెపరేటు