Vinayaka Chaturthi 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన, వివిధ రకాల పదార్థాలతో, వినూత్న రూపాల్లో గణనాథుడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. కొన్ని చోట్ల చాక్లెట్లు, ఉల్లిగడ్డలు, వేరుశెనక్కాయలు వంటి వాటితో వినాయకుడి విగ్రహాలను రూపొందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు అంకితమైన ఇతర రూపాల్లో గణేష్ విగ్రహాలు దర్శనమిస్తున్నారు.
చాక్లెట్ లతో వినాయకుడు..
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో వినాయక చవితి సందర్భంగా విశేష ఆకర్షణగా నిలుస్తోంది వినాయక కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన వెరైటీ వినాయకుడు. 10 రూపాయల చాక్లెట్లు, 5స్టార్ చాక్లెట్లతో చేసిన ఈ గణనాథుడిని తయారు చేయడానికి సుమారు 5 వేల చాక్లెట్లు ఉపయోగించారు. వీటి అంచనా విలువ దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన ఈ చాక్లెట్ వినాయకుడిను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఉల్లిగడ్డలతో బొజ్జ గణపయ్య..
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విజయనగర్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన వెరైటీ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 800 కిలోల ఉల్లిగడ్డలు, 100 కిలోల పాప్ కార్న్ ఉపయోగించి, దాదాపు 1. 50 లక్షల రూపాయల ఖర్చుతో ఈ బుజ్జి గణపయ్యను తయారు చేశారు. ఈ వినూత్నమైన వినాయకుడిని చూసేందుకు భక్తులు, స్థానికులు భారీగా తరలి వెళ్తున్నారు.
వేరుశెనగలతో గణనాథుడు..
వినాయక చవితి సందర్భంగా వేరు శెనగలతో తయారు చేసిన బొజ్జ గణపయ్య కాకినాడలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వేల కిలోల వేరుశెనగలు ఉపయోగించి కళాత్మకంగా రూపొందించిన ఈ వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ వేరుశెనగ వినాయకుడిని దర్శించి, ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.