Deputy CM Pawan: కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ఈ టూర్ లో భాగంగా ప్రజా సమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు. ఇక, రేపు పిఠాపురంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో డిప్యూటీ సీఎం పాల్గొని, స్థానిక ప్రజలతో కలిసి పండుగ చేసుకోనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుల సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు.
Read Also: Off The Record : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుపై నెగిటివ్ టాక్..
అయితే, ఈ నెల 10న జిల్లా పోలీస్ అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, పండుగ సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ వ్యవస్థ పనితీరుపై సమీక్షించనున్నారు. అదే రోజు రంగరాయ మెడికల్ కాలేజీలో పలు కీలక శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, కందుల దుర్గేష్ పాల్గొంటారు. జిల్లా అభివృద్ధిపై తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులతో కలిసి చర్చించనున్నారు. కాగా, డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.
