వ్యవసాయ రంగంపై పలు ప్రశ్నలు సంధిస్తూ.. రైతుల్ని అన్యాయం చేస్తున్నారని సీఎం జగన్‌కు నారా లోకేష్ రాసిన లేఖపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లోకేష్ ఏమైనా హరిత విప్లవ పితామహుడా? లేక వ్యవసాయ రంగ నిపుణుడా? అంటూ ఆయన ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు అయినంత మాత్రాన.. ఏది పడితే అది అడిగేస్తారా? అని ప్రశ్నించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తనకే ఇబ్బందికరంగా ఉందని అన్నారు. అసలు లోకేష్‌కు రైతు, కౌలు రైతు అంటే ఏమిటో తెలుసా? అని సెటైర్ వేశారు.
ఇక అసని తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయని కాకాణి అన్నారు. అసని తుఫానుకు సంబంధించి అంచనాలు వేయమని అధికారుల్ని ఆదేశించామని, ప్రాథమికంగా ఆరు వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా అంచనా వేస్తున్నామన్నారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి రిపోర్ట్ వస్తుందని.. ఈ సీజన్ ముగియడానికి ముందే రైతులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, రైతు రథం పేరుతో జూన్ 6వ తేదీన మరో కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఆరు వేల ట్రాక్టర్లను అందజేయనున్నామని, రైతులు నేరుగా తమకు నచ్చిన కంపెనీ ట్రాక్టర్లను కొనుగోలు చేయొచ్చని కాకాణి చెప్పారు. ట్రాక్టర్లు కొన్న సమాచారాన్ని తమకిస్తే, సబ్సిడీని రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామని తెలిపారు. టీడీపీ, పచ్చ మీడియా పనిగట్టుకొని మరీ బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నామని.. వారి మాటల్ని నమ్మొద్దని కాకాణి గోవర్ధన్ రెడ్డి కోరారు.