తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు పెరిగిపోతున్నాయి. అమాయకులు లోన్ యాప్ ల మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. ఏలూరు జిల్లా ఎస్.పి. రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు జిల్లా లో లోన్ యాప్ లు, ఆక్సిడెంట్ లపై ప్రజలకు అవగాహన కల్పించాలని అందులో భాగంగా సచివాలయ మహిళా పోలీసులకు(GMSK) లకు అవగాహన కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం డి.ఎస్.పి. కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి. సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో దిశ యాప్ మెగా డౌన్ లోడ్ కార్యక్రమం జరుగుతోందన్నారు.
దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం వలన మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అక్కడికి సమీపంలో వున్న పోలీసులు వారికి అందుబాటులోకి వస్తారన్నారు. మహిళలకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చి సహకరిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. ఇదే సమయంలో అందరూ ఆండ్రాయిడ్ ఫోన్ లు వాడడం వలన అనేక నకిలీ లోన్ యాప్ లు డౌన్ లోడ్ అయ్యి ప్రజలను అప్పుల పేరుతో ఉచ్చులోకి లాగుతున్నాయన్నారు. ప్రజలు లోన్ యాప్ ల ద్వారా అప్పు తీసుకుని అవి తీర్చలేక ఆత్మ హత్యల వరకూ పరిస్థితి వెళ్తోందనన్నారు.
Read Also:
Ram Gopal Varma: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ కంటే కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్
ఇలాంటి ఫేక్ లోన్ యాప్ ల నుండి అప్పులు తీసుకుని ముప్పు కొని తెచ్చుకోవద్దని సూచించారు. అలాగే చిట్ ఫండ్ లలో డబ్బులు కట్టేటప్పుడు అనధికారిక చిట్ ఫండ్ లలో డబ్బులు పెట్టి వాటిని పోగొట్టుకుంటున్నారని కాబట్టి అనధికారిక చిట్ ఫండ్ లకు, కాల్ మనీ వ్యాపారులకు ప్రజలు దూరంగా వుండాలని డి.ఎస్.పి. సత్యనారాయణ అన్నారు. అలాగే జంగారెడ్డిగూడెం డివిజన్ లో ఇటీవల అనేక రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లాలో ఆక్సిడెంట్ లు జరిగినప్పుడు చనిపోయిన వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే వుంటున్నారన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు వారు హెల్మెట్ ధరించక పోవడం వలన ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని డి.ఎస్.పి. సత్యనారాయణ అన్నారు. ఇక నుండి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అందుకు సచివాలయ మహిళా పోలీసులు ప్రజలను చైతన్యవంతులను చేయడంలో భాగం కావాలని అన్నారు. అలాగే సచివాలయ మహిళా పోలీసులు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. గ్రామాలలో ఏచిన్న సంఘటన జరిగినా వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ కు సమాచారం ఇచ్చి సహకరిస్తున్నారని డి.ఎస్.పి. సచివాలయ మహిళా పోలీసులను ఆభినందించారు.
Read Also: God Father: ‘నజభజ జజరా…’ ‘గాడ్ ఫాదర్’ అదిగోరా!