God Father: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ దసరా కానుకగా అక్టోబర్ 5న జనం ముందుకు రానుంది. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంత పూర్ లో సెప్టెంబర్ 28వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రంలోని “నజభజ జజరా…” అంటూ మొదలయ్యే పాటను మంగళవారం లిరికల్ వీడియోగా రిలీజ్ చేశారు. “నజభజ జజరా… నజభజ జజరా… గజగజ వణికించే గజరాజడిగోరా…” అంటూ పాట మొదలవుతుంది.
థమన్ బాణీలకు అనంత్ శ్రీరామ్ ఈ పాటను పలికించారు. శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర ఈ గీతాన్ని ఆలపించారు. చిరంజీవి ఫైటింగ్ ఇమేజెస్ పై ఈ లిరికల్ వీడియో రూపొందింది. “ఘీమ్ ఘీమ్ ఘీంకరించిన ఐరావతం… గిర్రుగిర్రున తొండము తిప్పితె చిత్తడై పోతావ్…” అంటూ పాట సాగుతుంది. “అడవి తల్లికి అన్నయ్య వీడురా… కలబడితే కథకళిరా…” అనీ ఈ గీతంలో పదాలు చోటు చేసుకున్నాయి. పాటలో పదాలు కథకు అనువుగా సాగి ఉండవచ్చు. కానీ, గీత రచయిత పాట ఆరంభంలోనే కథానాయకుణ్ణి గజరాజుతో పోల్చారు. అలాగే గజం చేసే ‘ఘీంకారాన్ని’ పొందు పరిచారు. అంటే ‘మత్తేభాన్ని’ గుర్తు చేసే ప్రయత్నం సాగింది. కానీ చిత్రంగా రచయిత ‘చంపకమాల’ వృత్తంలోని గణాక్షరాలు “నజభజ జజరా…” అంటూ పాటను మొదలు పెట్టడం ఆశ్చర్యంగా కలిగిస్తుంది. ‘మత్తేభం’లోని “సభరన మయవ” ఎందుకని రచయిత విస్మరించి, ‘గజరాజు’కు ‘నజభజ జజరా…’ జోడించారో ఆయనే వివరిస్తే కానీ తెలియదు. ఏది ఏమైనా ‘గాడ్ ఫాదర్’లోని ఈ “నజభజ జజరా…” మెగాస్టార్ అభిమానులను విశేషంగా అలరిస్తుందని చెప్పవచ్చు.