ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ఉద్యమం ఉధృతం రూపం దాల్చింది.. ఇవాళ నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడంతో.. వారిలో మరింత పట్టుదల పెరిగింది.. రేపు సమావేశమై… భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధం అయ్యారు.. ఇదే సమయంలో సమ్మెకు సిద్ధం అవుతున్నారు.. ఇక, ఉద్యోగులకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.. ఇవాళ ఉద్యోగుల ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఆ కష్టాలు తనకు తెలుసునని.. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని ఇన్నాళ్లు వెనక్కి తగ్గానని.. ఇక ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు తాను విడుదల చేసిన ఓ వీడియోలు పేర్కొన్నారు జనసేనాని.
Read Also: అరెస్ట్ చేసిన ఉద్యోగులను భేషరతుగా విడుదల చేయాలి.. రేపు కార్యాచరణ ప్రకటన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని.. ఏ ప్రభుత్వం చేయని విధంగా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తుచేసిన ఆయన.. కానీ, వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలి, కానీ అందుకు విరుద్దంగా జీతాలు తగ్గించడం ఉద్యోగులను వంచనకు గురి చేయడమే అవుతుందన్న పవన్ కల్యాణ్… ఇవాళ విజయవాడలో మండుటెండను సైతం లెక్కచేయక నిలబడి లక్షలాది మంది ఉద్యోగులు నిరసన తెలపడం చాలా బాధ కలిగించిందన్నారు… ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన పాపానికి వందల మందిని అరెస్టులు చేయడం.. లాఠీ చార్జ్ చేయడం దురదృష్టకరమన్న ఆయన.. వైసీపీ నాయకుల ఆదాయం మూడు రెట్లు పెరిగితే.. ఉద్యోగుల జీతాలు 30 శాతం తగ్గాయంటూ విమర్శలు గుప్పించారు.. అయితే, ఇంతకుముందే ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించేవాళ్లం.. కానీ, ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నాయకులు వేరే రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయదలుచుకోలేదని చెప్పడంతో ఒక అడుగు వెనక్కి తగ్గినట్టు ఈ సందర్భంగా వెల్లడించిన పవన్.. ఉద్యోగులు అడిగినప్పుడు మాత్రం కచ్చితంగా మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నాయకులకు కూడా చెప్పానన్నారు.. జనసేన నాయకులకు, శ్రేణులకు, జన సైనికులకు కూడా చెబుతున్నాం ఉద్యోగులకు మద్దతుగా ఉండాలి అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు వపన్ కల్యాణ్.