రాష్ట్రంలో అహంకారానికి-ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతోంది.. ఈ పోరాటంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా నష్టపోయినా పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపిన ఆయన.. అయితే, మంగళగిరి నియోజవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ అనుకున్నాం.. కానీ, జనసేన ఆవిర్భావ సభ నిర్వహించుకోవడానికి వీల్లేని విధంగా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని విమర్శించారు.. స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. ముందు నిండు మనస్సుతో సభ నిర్వహించుకోవడానికి స్థలం ఇస్తామన్న రైతులు.. కాసేపటికే స్థలం ఇవ్వలేమని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారన్నారు.. సభా వేదిక స్థలం వారం రోజుల్లో నాలుగు చోట్ల మారిందంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ఒత్తిడి చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు మనోహర్.
Read Also: AP Capital: ఒకటికి 10 సార్లు చెబుతున్నాం.. 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం..
ఇక, వైఎస్ జగన్ పాలనపై ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచించుకోవాలని సూచించారు నాదెండ్ల మనోహర్.. ప్రభుత్వంలో చాలా మంది అహంకారంతో పని చేస్తున్నారన్న ఆయన.. ప్రజలు నిండు మనస్సుతో 151 సీట్లు ఇస్తే.. పరిపాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు.. చాలా మంది పేదలకు సంక్షేమ ఫలాలు అందడం లేదని విమర్శించారు. మరోవైపు, అమరావతిపై హైకోర్టు తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు మనోహర్.. ఓ ఉద్యమ గళాన్ని వినిపించకుండా చేయాలనుకున్న ప్రభుత్వ పిచ్చి భ్రమను కోర్టు తన తీర్పుతో తొలగించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరితో ఏపీ చాలా నష్టపోయిందన్న ఆయన.. ప్రభుత్వం రాజధాని రైతులను ఎన్నో అవమానాలకు గురి చేసిందన్నారు. ఇక, అహంకారానికి-ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతోంది.. ఈ పోరాటంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా నష్టపోయినా పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపిన ఆయన.. ఆవిర్భావ సభలో పవన్ ఏం మాట్లాడతారో మీరే చూస్తారు.. భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా తీసుకెళ్తారోననేది స్పష్టం చేస్తారని తెలిపారు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతోందో స్పష్టంగా చెబుతామన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రజలకు, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. సీఎం జగన్ నిర్ణయం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణ అంటున్నారు.. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు.. కానీ, సంక్షేమ ఫలాలు అందడం లేదని విమర్శలు గుప్పించారు నాదెండ్ల మనోహర్.