YS Jagan : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు పరిపాలన వైఫల్యమే కారణమని ఆయన ఎక్స్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు. “ప్రతిరోజూ పరిపాలనలో తనను మించిన వారు లేరని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు… వాస్తవానికి పరిపాలనలో ఘోర వైఫల్యాలు చేస్తున్నారని” జగన్ ఎద్దేవా చేశారు.
“కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. రాష్ట్రంలోని పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను రాజకీయ కక్షసాధింపులకే వాడుకుంటున్నారు. భక్తుల భద్రతపై మాత్రం సర్కార్ శ్రద్ధ చూపడం లేదు,” అని మండిపడ్డారు.
లడ్డూ వ్యవహారం సృష్టించి, ప్రత్యర్థులను ఇరికించడంలో ఆసక్తి చూపే ప్రభుత్వం, భక్తుల రక్షణలో మాత్రం విఫలమైందన్నారు. “ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా వస్తారని తెలిసినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఇది ప్రైవేట్ ఆలయమని చెప్పి తప్పించుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం,” అని జగన్ విమర్శించారు.
ప్రభుత్వం భక్తుల భద్రత కల్పించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడం దారుణమని అన్నారు. రాష్ట్రంలోని దేవాదాయశాఖ ఆలయాలు మాత్రమే కాకుండా, ప్రైవేటు దేవాలయాల్లో కూడా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
“చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇది మొదటి తొక్కిసలాట కాదు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా 6 మంది, సింహాచలంలో 7 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయినా పాఠాలు నేర్చుకోని ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ కాశీబుగ్గలో 9 మంది మరణాలకు కారణమైంది,” అని ఆయన అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తొక్కిసలాట జరిగిన వెంటనే వైద్యుడైన, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించి, గాయపడిన భక్తులకు సత్వర చికిత్స అందించడం అభినందనీయమని జగన్ ప్రశంసించారు. “అప్పలరాజు సమయానికి స్పందించి ఇద్దరు భక్తుల ప్రాణాలను కాపాడారు. ఆయన చర్య స్ఫూర్తిదాయకం,” అని అన్నారు.
Accident : అమెరికాలో కారు ప్రమాదం.. ఏపీకి చెందిన భార్యాభర్తలు మృతి