అమరావతి రాజధాని విషయంలో వచ్చిన కోర్టు తీర్పుపై విజయనగరం జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐవీపి.రాజు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని విషయంలో కోర్టు తీర్పుపై అక్కడ రైతులు దీపావళి పండుగ చేసుకుంటున్నారన్నారు. 807 రోజులు పాటు రైతులు చేసిన త్యాగ ఫలమే ఈ తీర్పు అని ఆయన అన్నారు. అమరావతి రైతుల చేసిన ధర్నాలు పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, తద్వారా ఎన్నో దాడులు చేశారు. మహిళలని చూడకుండా వారిపైన కూడా దాడి చేశారని ఆరోపించారు. స్వాతంత్ర్య కోసం మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే పోరాటం చేశారో అదే సంకల్పంతో అమరావతి రైతులు కూడా పోరాటం చేశారని, ఈ సమస్య ఒక్క అమరావతి రైతులది మాత్రమే కాదు. ప్రతీ ఒక్క ఆంధ్రుడి సమస్య అని ఆయన అన్నారు. 2014లో రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చారు.
దీంతో అక్కడ రైతులనందరినీ మమేకం చేస్తూ అమరావతి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు పూనుకున్నారని ఆయన తెలిపారు. కానీ నేడు మాత్రం అమరావతిని రాజధానిగా లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ప్రత్యేక హోదా విషయంలో అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మెజారిటీ ఎంపీలు ఉన్నా కేంద్రం మీద పోరాటం చేయలేకపోతున్నారని, భూములను దోచుకోవడానికి, దాచుకోవడానికి మాత్రమే మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకు వచ్చారని ఆయన విమర్శించారు.