ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ.. కొత్త చర్చకు తెరతీసింది.. విజయవాడ నోవల్ టెల్ హోటల్‌లో బస చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఏకాంత చర్చలు జరిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మొత్తంగా వీరి సమావేశం గంటా 20 నిమిషాల పాటు జరిగింది.. కొద్దిసేపు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌తో సహా పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపిన టీడీపీ అధినేత.. ఆ తర్వాత గంటకు పైగా పవన్ కల్యాణ్‌లో ఏకాంత చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది.. బీజేపీపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసిన కాసేపటికే.. ఈ భేటీ జరగడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇక, ఈ భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది..
Read Also: 5G India Rollout: త్వరలోనే ఈ నగరాల్లో 5 జీ సేవలు.. వచ్చే మార్చి నాటికి 200 నగరాలు టార్గెట్
తన విశాఖ పర్యటనలో ఎదురైన అనుభవాలు, విశాఖలో ప్రభుత్వ, పోలీసుల తీరును చంద్రబాబుకు వివరించిన పవన్ కల్యాణ్.. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఉమ్మడి వేదిక ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై నేతల మధ్య చర్చ సాగిందట.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒకే వేదిక మీద తేవాలని టీడీపీ-జనసేన అధినేతలు అభిప్రాయపడ్డారు.. లెఫ్ట్ పార్టీలను.. బీజేపీని ఒకే వేదిక మీదకు తేవడం కష్టంతో కూడుకున్న వ్యవహరమని అభిప్రాయపడ్డ నేతలు… రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలనే కోణంలో ప్రయత్నం చేయాలనే నిర్ణయానికి వచ్చారట.. ప్రతిపక్ష పార్టీలు ఏకమైతే ప్రభుత్వాన్ని దారిలోకి తేవడం పెద్ద కష్టం కాదని పవన్ అభిప్రాయపడగా.. ఎన్నికల వరకు ఉమ్మడి వేదికగా పోరాటాలు చేస్తే ఫలితం ఉంటుందని ఇద్దరూ భావించినట్టుగా తెలుస్తోంది.. ఇక, ముందస్తు ఎన్నికలకు వైఎస్ జగన్ వెళ్తారనే ప్రచారం పైనా నేతల భేటీలో ప్రస్తావనకు రాగా.. ఓ వైపు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తూనే ఎన్నికలకు సిద్దమవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ, జనసేన అధినేతలు ఒక అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తీసుకునే స్టాండ్ ఏ విధంగా ఉండబోతోందనే అంశంపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చాను.. ప్రతిపక్ష నేతలు తిరగనీయకుండా దాడులు చేస్తున్నారు.. నాపై దాడి చేసి.. మా కార్యకర్తలపై కేసులు పెట్టారు.. పవన్‌పై దాడి చేసి జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టారని మండిపడ్డారు.. నేను విశాఖలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారు.. పవన్ విమానం దిగినప్పటి నుంచి ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారు.. పవన్ రాష్ట్రానికి పౌరుడు కాదా..? పవన్ విశాఖ వెళ్లకూడదా..? ప్రభుత్వమే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ.. తిరిగి ప్రతిపక్షంపై కేసులు పెడతారా..? రాజకీయ నేతలకే రక్షణ లేకుంటే.. సామాన్యులకు రక్షణ ఏది..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మనుషులను నిర్వీర్యం చేసేందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.. ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు.. 40 ఏళ్లుగా చూడని కొత్త రాజకీయం చూస్తున్నాను.. ప్రతిపక్షాలకూ స్వేచ్ఛ లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుదాం అని పిలుపునిచ్చారు.. ప్రతిపక్ష పార్టీల మనుగడే లేకుంటే ప్రజల పరిస్థితేంటి.? అని ప్రశ్నించిన ఆయన.. ప్రతిపక్ష నేతలను తిట్టి, శారీరకంగా హింసించి ఆనందపడుతున్నారు అని ఫైర్ అయ్యారు.. అవసరమైతే మళ్లీ భేటీ అవుతామని తెలిపారు చంద్రబాబు..
ఇక, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి రక్షణ లేకుండా పోయింది.. ప్రజాస్వామ్యం విలువలు కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.. విశాఖ ఘటనపై అన్ని రాజకీయ పార్టీలు నాకు సంఘీభావం తెలిపాయి.. తెలంగాణ నేతలు కూడా ఫోన్ చేసి మద్దతు తెలిపారు.. పార్టీల గొంతును నొక్కేస్తే ఎలా..? అని ప్రశ్నించారు. జనసేన-టీడీపీలనే కాదు.. మా సొంత మిత్రపక్షమైన బీజేపీని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న ఆయన.. అన్ని పార్టీలు ప్రజాస్వామ్యం కాపాడేలా పోరాడాలన్నారు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలనూ కలుపుకెళ్తాం.. ముందుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.. ఆ తర్వాత రాజకీయం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..