ఏపీలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరులో పెనువిషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన సతీష్ అనే ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. గూడూరు డీఆర్‌డబ్ల్యూ పరీక్షా కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. అయితే పరీక్షా కేంద్రానికి వచ్చినప్పుడే గేటు వద్ద తనకు ఛాతిలో నొప్పిగా ఉందని అక్కడి సిబ్బందితో సతీష్ చెప్పినట్లు తెలుస్తోంది.
అనంతరం పరీక్షా కేంద్రంలోని గది వద్దకు చేరుకోగా విద్యార్థి సతీష్ గుండెపోటు కారణంగా అక్కడే కుప్పకూలిపోయాడు. కాలేజీ సిబ్బంది అతడిని వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించగా అప్పటికే మరణించినట్లు తేలింది. సతీష్ మృతి చెందినట్లు వెంటనే కాలేజీ సిబ్బంది అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా మృతి చెందిన విద్యార్థి సైదాపురం వాసిగా అధికారులు గుర్తించారు. మృతుడు ఇంటర్ సెకండియర్ పరీక్షల కోసం పరీక్షా కేంద్రానికి హాజరయ్యాడు.