ఉద్యమ కార్యాచరణకు సిద్ధం చేసే సమయంలో నేను మాట్లాడిన మాటలను కొందరూ తప్పుగా అన్వయించారని, ప్రభుత్వాన్ని గద్దె దించుతామని నేను అనలేదని ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నేను అనని మాటలను అన్నట్టుగా ట్రోల్ చేసి ఉద్యమం పక్కదారి పట్టించేందుకు కొన్ని మాధ్యమాలు ప్రయత్నిస్తున్నాయన్నారు.
నాలుగు గోడల మధ్య జరిగిన సమావేశంలో మాటలను బయట పెట్టి రాజకీయం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని బండి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం మా డిమాండ్ల పై సానుకూలంగా ఉందని మేము భావిస్తున్నామని ఆయన అన్నారు. మా డిమాండ్ల పరిష్కారం కోసం స్పష్టమైన హామీ ఇస్తే మేం ఉద్యమం ఆపడానికి సిద్ధం. తెలంగాణలో పీఆర్సీ అమలు చేసి ఇక్కడ ఇవ్వకపోతే ఉద్యోగులలో అందోళన పెరుగుతుందన్నారు. అందుకే ఉద్యమం చేయాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యన వారధిగా ఉండేది ఉద్యోగులమే అని బండి శ్రీనివాస్ అన్నారు.