తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. లాంగ్ వీకెండ్ రావడంతో అందరూ ఒక్కసారిగా తిరుమలకు చేరుకున్నారు. దీంతో సప్తగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈనెల 21 వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వరుస సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో తమ యాత్రను వాయిదా వేయాలని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది.
Read Also: Uttar Pradesh: ఇంటిపై పాకిస్తాన్ జెండా.. వ్యక్తి అరెస్ట్
అటు అలిపిరి చెక్ పాయింట్ వద్ద తిరుమలకు వెళ్లేందుకు వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడుతోంది. కాగా గత రెండేళ్లుగా తిరుమలలో భక్తులకు దర్శనాలు లేకపోవడం, కోవిడ్ ఆంక్షల కారణంగా పరిమిత సంఖ‌్యలో భక్తులను దర్శనానికి అనుమతించేవారు. ఈ ఏడాది కోవిడ్ ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో కార్యక్రమాలు యథావిధిగా సాగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. క్యూలైన్లలో నిలబడి ఉన్న వారికి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు తాగునీరు, చిన్నపిల్లలకు పాలు అందించే ఏర్పాట్లు చేశారు.