క్షేత్ర స్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం.. ఓటీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేదుకు అధికార వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించి దీనిపై స్పష్టంగా వివరిస్తున్నారు.
గతంలో హౌసింగ్ బోర్డుల కింద అప్పులు తీసుకుని … ఆ అప్పులు కట్టకపోవడం వల్ల ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుని వచ్చిందే వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం. ఈ పథకం కింద డీ ఫార్మ్ పట్టాల్లో కట్టిన ఇళ్లకు కూడా రిజిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకుని వస్తుంది ప్రభుత్వం. దీని వల్ల లబ్దిదారులకు ఇంటిపై సర్వ హక్కులు వస్తాయి. కొనుగోలు, అమ్మకాలు చేపట్టే అవకాశం ఉంటుంది.
అదే విధంగా ఇంటి పై బ్యాంకుల్లో రుణాలు తీసుకోవటం వంటి సౌలభ్యాలు లభిస్తాయి. అంతే కాకుండా ఏళ్లుగా ఉన్న మొత్తం రుణం వడ్డీతో సహా మాఫీ అవుతుంది. ఒన్ టైమ్ సెటిల్ మెంట్ కింద పంచాయతీల్లో రిజిస్ట్రేషన్‌కు ఇంటికి పదివేల రూపాయలు, మున్సిపాలిటీల్లో 15వేలు, కార్పొరేషన్లలో 20వేలు కట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ధారిత మొత్తం కంటే అప్పు తక్కువగా ఉంటే…ఆ తక్కువ మొత్తాన్నే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ చేయిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో భూముల విలువ పెరిగిపోయిన తరుణంలో వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా.. ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతిపాదిస్తున్న మొత్తం కంటే రెండు, మూడింతలు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఒన్ టైమ్ సెటిల్ మెంట్ పథకంలో ఉన్న ప్రయోజనాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లి.. లబ్దిదారులకు అవగాహన కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఎప్పుడో కట్టిన ఇళ్లకు ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తోంది అన్న అనుమానాలు ప్రజల్లో వచ్చాయి. ఈ పరిస్థితులను అవకాశంగా మలుచుకున్న టీడీపీ వైసీపీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. ఓటీఎస్ పథకం కింద డబ్బులు కట్టకుండా ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని.. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ఈ మొత్తం వ్యవహారం వైసీపీ తలనొప్పిగా మారింది. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు.ఎమ్మెల్యేల నుంచి గ్రామ సర్పంచుల వరకు అందరితో వరుసగా టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు, పథకం స్వరూపం వివరిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు.