ఏపీ సర్కార్ పై జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. దేశంలో పంపిణీ జరిగిన ప్రతి 7 వెంటిలేటర్లలో ఒకటి ఏపీకి దక్కిందని..రాష్ట్రంలో చాలా చోట్ల వెంటిలేటర్లను సరిగా ఉపయోగించడం లేదని సమాచారం ఉందన్నారు. “కరోనా” కేసుల్లో ఏపీ 5వ స్థానంలో, మరణాల్లో 9వ స్థానంలో ఉందని.. ఇంత దారుణ పరిస్థితి ఏపీలో ఎందుకు నెలకొంది? అని ప్రశ్నించారు. నవరత్నాల పేరుతో గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందని ఫైర్ అయ్యారు. ఏపీలో సరైన సంఖ్యలో టెస్టులు లేవు, ప్రభుత్వాసుపత్రుల్లో అధ్వాన పరిస్థితి ఉందని…గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైద్య మౌలిక వసతులను ఎందుకు మెరుగుపర్చలేకపోయింది? అని నిలదీశారు. వ్యాక్సినేషన్ విషయంలోనూ ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని… మాస్కు ధరించడం వంటి “కోవిడ్ బిహేవియర్” రాష్ట్ర సీఎం, మంత్రులు ఎవరూ పాటించడం లేదన్నారు. వారికి “కోవిడ్” భయం లేదా? లేక “కోవిడ్” వైసీపీకి ఏమైనా ప్రత్యేక మినహాయింపునిచ్చిందా? అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చే సందేశం ఏంటి? ఏం సంకేతాలు పంపుతున్నారు? అని నిలదీశారు.