ఇదేదో సినిమా టైటిల్ కాదు. నిజంగా జరిగిన సంఘటన. 10వతరగతి అంటే నిండా 15 ఏళ్ళు కూడా నిండవు. పెళ్లి చేసుకునే వయసు కూడా కాదు. కానీ అక్కడ అమ్మాయి, అబ్బాయి పదవతరగతి పూర్తికాకుండానే పెళ్ళి చేసుకోవాలని భావించారు. బాపట్ల జిల్లాలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇన్విజిలేటర్లకు షాక్ ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు పూర్తైన వెంటనే పెళ్లి చేసుకునేందుకు రింగ్స్ తో వచ్చి ఇన్విజిలేటర్లకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
చుండూరు మండలం ఎడ్లపాడులో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. చివరి రోజు ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎగ్జామ్ రాస్తున్న ఓ విద్యార్ది జేబులో ఉంగరం గుర్తించారు ఇన్విజిలేటర్. ఉంగరం ఎందుకు జేబులో పెట్టుకుని వచ్చావని ప్రశ్నించిన ఇన్విజిలేటర్ కు విద్యార్ది చెప్పిన సమాధానం విని మైండ్ బ్లాంకయ్యింది. ఎగ్జామ్ పూర్తవగానే తాను ప్రేమించిన క్లాస్ మేట్ ను పెళ్లి చేసుకునేందుకు ఉంగరం తెచ్చుకున్నట్లు చెప్పాడు. అయినా డౌట్ వచ్చిన ఇన్విజిలేటర్ విద్యార్ది చెప్పిన అమ్మాయి వద్దకు వెళ్లారు. విద్యార్దిని దగ్గర కూడా ఉంగరం కనిపించింది. దీంతో ఉంగరం చూసి టీచర్ షాక్ తిన్నారు. ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు విద్యార్దుల ప్రేమ, పెళ్లి చేసుకోవాలని వేసుకున్న ప్లాన్ గురించి తెలియడంతో ఏం చెయ్యాలో తెలియక ఇన్విజిలేటర్ తల పట్టుకున్నాడు. ఇలాగే వదిలేస్తే ఈ ఘటన వివాదాస్పదంగా మారుతుందని భావించిన ఇన్విజిలేటర్ ఎగ్జామ్ పూర్తైన తర్వాత ముందుగా ఆడపిల్లలను పంపించేశారు. అరగంట తర్వాత మగపిల్లలను ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు పంపించారు. మరి ఆ అమ్మాయి, అబ్బాయి కలిశారా? పెళ్ళిచేసుకున్నారా? అనేది ఇంకా తేలలేదు. పిదప కాలం పిదప బుద్ధులు అంటే ఇవే మరి. సోషల్ మీడియా ప్రభావం, సినిమాల ప్రభావమే ఇలాంటి ధోరణులకు కారణంగా చెప్పవచ్చు.