Andhra Pradesh RGF: కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) గురించి అందరికీ తెలుసు. కేజీఎఫ్ సినిమాతో ఈ విషయం విశ్వమంతా తెలిసింది. అయితే ఏపీలో RGF ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆర్జీఎఫ్ అంటే రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ . నష్టాల కారణంగా రెండు దశాబ్దాల క్రితం ఆర్జీఎఫ్‌కు తాళం పడగా.. ఇప్పుడు మళ్లీ తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రామగిరి బంగారు గనుల కోసం టెండర్లు మెుదలయ్యాయి. ఆగస్టు నెలాఖరులో టెండర్లు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని రామగిరి నార్త్ బ్లాక్, సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని 10 బ్లాక్‌ల బంగారు గనుల కోసం భారత ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల నుండి టెండర్లను ఆహ్వానించింది. రొద్దం మండలంలోని బొక్సంపల్లి నార్త్ ప్లాంట్, బొక్సంపల్లి సౌత్ బ్లాక్, కదిరి మండలంలోని జవకుల -ఎ, జవకుల-బి, జవకుల -సి, జవకుల-డి, జవకుల-ఒ, జవకుల-ఎఫ్ లను వేలం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వీటిలో 5 గనులకు ఈ నెల 26న, మిగతా ఐదు గనులకు ఈనెల 29న వేలం నిర్వహించనున్నారు.
Read Also: Onion Prices Fall: ఉల్లి ధర పతనం.. అన్నదాతల కన్నీరు..
కాగా 2015లో మైనింగ్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ మేరకు ఏపీలోని 10 బంగారు గానులు, ఉత్తరప్రదేశ్‌లో మూడు గనులను తవ్వాలని కేంద్రం నిర్ణయించింది. బ్రిటీష్ కాలంలో రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ సంగతి బయటకు వచ్చింది. రామగిరి ఆర్‌పీ బ్లాక్‌లో 13 కి.మీ. పొడవు గల రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ (RGF) ఉన్నాయి. 1973లో రామగిరి ప్రాంతంలోని దొడ్డ బురుజు పేరుతో బంగారు నిక్షేపాలను వెలికితీసేందుకు తొలిసారి ఇక్కడ మైనింగ్ చేశారు. అప్పట్లో టన్ను మట్టిలో నుంచి 20 గ్రాముల బంగారాన్ని వెలికి తీసేవారు. 1984లో కర్నాటకలోని కోలార్ జిల్లాకు చెందిన కర్నాటక గోల్డ్ ఫీల్డ్ కంపెనీ రామగిరిలో భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఇక్కడ మైనింగ్ ప్రారంభించారు. అలా ఏడాదికి 120 కిలోల బంగారం చొప్పున 17ఏళ్ల పాటు బంగారం వెలికితీశారు. ఏప్రిల్ 2001 వరకు భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (BGML) RGFలో భూగర్భ గనిని నిర్వహించింది. అయితే గనుల రిటర్న్‌ల కంటే ఎక్కువ ఖర్చుల కారణంగా నష్టాలు రావడంతో మూసివేశారు. 2015లో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ గనుల తవ్వకాలు తెరపైకి వచ్చాయి. అయితే రామగిరి గోల్డ్ ఫీల్డ్స్‌లో వందల ఏళ్ల పాటు తవ్వినా తరిగిపోని బంగారు నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. తాజాగా కేంద్రం మైనింగ్‌కు అవకాశం ఇవ్వడంతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.