TDLP Leader Gorantla Butchaiah Chowdary held protest rally at Secretariat to Assembly.
ఏపీ ఆసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి మోసగించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి ఖాళీలను భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీని టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పనలో తెలంగాణను చూసైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని, రాష్ట్రంలో ప్రధాన సమస్యగా నిరుద్యోగం ఉందని, నిరుద్యోగం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రతిపక్ష నేతగా జగన్ 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మోసగించారన్నారు. తెలంగాణలో 90వేల పోస్టులు భర్తీ చేస్తే ఏపీలో ఎందుకు చేయట్లేదు..? అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని, పదవీ విరమణ చేసిన వారి పోస్టులు సైతం భర్తీ చేయట్లేదని ఆయన మండిపడ్డారు. గుడ్డి ప్రభుత్వం వల్ల నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని, ఆదాయం పెరిగిందంటున్న ప్రభుత్వం.. ఉద్యోగాల భర్తీ ఎందుకు చేపట్టట్లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు.