కాకినాడలో ఎస్సై గోపాలకృష్ణ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అధికారు వేధింపులు, అవమానాల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల్ని కూడా మాట్లాడనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించడం పలు అనుమానాలకు తావిస్తోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఎస్సై ముప్పవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య మొత్తం పోలీసు శాఖకే అవమానం. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో ఉన్న కులవివక్షకు ఇదొక నిదర్శనం అన్నారు. గర్వంగా పోలీసు యూనిఫాం వేసుకుని విధులు నిర్వర్తించే ఒక అధికారి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది?
దీనికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? టీడీపీ హయాంలో అన్ని శాఖల్లో సమర్థత, సీనియారిటీ ఆధారంగా పోస్టింగులిచ్చాం.కానీ నేడు కులాల వారీ ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత అనైతికం. ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న అజయ్ కల్లాం రెడ్డికి నాడు టీటీడీ ఈవోగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు అవకాశాలు ఇవ్వలేదా? ఇప్పుడు సిఎంఓలో కీలకస్థానంలో ఉన్న జవహర్ రెడ్డి నాటి పంచాయితీరాజ్ మంత్రి నారా లోకేష్ దగ్గర పని చెయ్యలేదా?
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కులం కారణంగా వందల మంది పోలీసు అధికారులకు గత రెండు, మూడేళ్లుగా పోస్టింగులు నిలిపివేయడం వాస్తవం కాదా? తండ్రిని కోల్పోయిన గోపాలకృష్ణ పిల్లల ఉసురు తగిలి కులద్వేషంతో రగిలిపోతున్న వైసీపీ ప్రభుత్వం దహించుకుపోవడం ఖాయం అన్నారు గోరంట్ల.