నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. నిత్యం నిమ్మకాయ వాడేవారికి విటమిన్ సీ లోపం కలగదు. పరగడుపునే కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. కానీ నిజానికి వాటికి బదులుగా నిమ్మరసం తాగితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగండి. ఇది తాగిన కాసేపటివరకూ టీ, కాఫీల జోలికి వెళ్లకండి. దీని వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిస్తే షాకవుతారు.
నిమ్మకాయల్లో విటమిన్ సీ ఎక్కువగా వుంటుంది. కరోనా వంటి మహమ్మారిని తగ్గించాలంటే విటమిన్ సీ ఎంతో అవసరం. శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇందులో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎంతో మేలుని కలిగిస్తాయి. ఒక నిమ్మకాయను పూర్తిగా తీసుకునేట్లయితే మనకు 18.6 మిల్లీగ్రాముల విటమిన్ సీ లభిస్తుంది. మనకు నిత్యం 65 నుంచి 90 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం. అందువల్ల ఒక నిమ్మకాయను తీసుకుంటే దాని వల్ల రోజుకు కావల్సిన విటమిన్ సిలో దాదాపుగా 20 శాతం వరకు మనకు లభిస్తుంది. దీంతో విటమిన్ సీ ని శరీరం ఉదయం నుంచే ఉపయోగించుకుంటుంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
అధిక బరువుతో బాధపడేవారికి నిమ్మ దివ్యౌషధం. ఉదయాన్నే పరగడుపునే నిమ్మరసం తాగడం వల్ల అధిక బరువు తగ్గవచ్చు. వీటిల్లో ఉండే పాలీఫినాల్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా బరువు పెరగకుండా చూస్తాయి. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. చర్మం నిగనిగలాడుతూ వుండాలంటే నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సీ అవసరం. చర్మాన్ని ముడతలు పడకుండా చూస్తుంది. సూర్య కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడే శక్తి నిమ్మకాయలకు వుంది. మలబద్దకం సమస్యకు చక్కని పరిష్కారం నిమ్మ. దీనివల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. అజీర్ణం సమస్య అసలు ఉండదు. నిమ్మరసం రుచిని చూడడం వల్ల జీర్ణాశయంలో అగ్ని పుడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కాబట్టి రోజూ ఉదయం నిమ్మరసం తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.