తెలంగాణలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.. పలు జిల్లాల్లో కుంభవృష్టి కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లి ఊళ్లను దిగ్భందించాయి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాపల్లిలో.. భూపాలపల్లి, మహాముత్తారం, మహదేవ్‌పూర్, కాటారం మండలాల్లో 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రస్తుతం 800 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూడా కూలిపోయాయి.. ఇక, పంట నష్టం అంచనా వేయాల్సి ఉంది.. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వాగులు పొంగిపొర్లుతున్నాయి.. దీంతో, కొన్ని రోడ్లు కొట్టుకుపోగా.. మరికొన్ని రోడ్లను దాటలేని పరిస్థితి ఉంది.. దీంతో, చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏ జిల్లాలో పరిస్థితి చూసినా అలాగే ఉంది.. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లోని ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి..
Read Also: Warangal: 100 శాతానికి మించి వర్షపాతం.. నిండిన చెరువులు
ఓవైపు ఆరు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న వర్షాలు.. మరోవైపు, ఎగువన కురుస్తోన్న వర్షాలతో మహారాష్ట్ర నుంచి గోదావరికి వరద పోటెత్తింది.. దీంతో.. ఎన్నడూ లేని విధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. గతంలో ఎప్పుడు లేనంతగా జూలై నెలలోనే గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది.. సాధారణంగా గోదావరికి జూలైలో వరదలు వచ్చినా… లక్ష క్యూసెక్కుల లోపే ఉండేవని గణాంకాలు చెబుతుండగా.. ఆ రికార్డును ప్రస్తుతం వరదలు బ్రేక్ చేశాయి.. 12 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది.. ఇది క్రమంగా పెరిగిపోతోంది.. ఓవైపు, రాష్ట్రంలో కురుస్తున్న కుంభవృష్టికి మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి భారీగా వస్తున్న వరద తోడు కావడంతో.. గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక వరకు వెళ్లినా.. వరద ఉధృతి మళ్లీ తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు.. అయితే, ఇవాళ ఉదయం నుంచి మళ్లీ భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. ఎప్పుడైనా మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. ఇక, వందేళ్ల చరిత్రలో ఎప్పుడు లేనట్లుగా జూలై నెలలోనే పోలవరం దగ్గర గోదావరికి రికార్డ్ స్థాయి వరద వచ్చిందని అధికారులు చెబుతున్నారు. పోలవరం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతుండడంతో.. ప్రాజెక్ట్ 48 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.. భద్రాచలం నుంచి వస్తున్న వరదతో పాటు శబరి నుంచి భారీగా ప్రవాహం ఉండడంతో.. క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది.. గోదావరి వరద ఉధృతి కారణంగా ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.01 లక్షల క్యూసెక్కులుగా ఉంది.. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది ఏపీ విపత్తుల సంస్థ .. మొత్తంగా.. తెలంగాణతో పాటు.. ఆంధ్రలోనూ వందేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో గోదావరిలో వరద కొనసాగుతోంది.