తెలుగుదేశం పార్టీలో కీలకనేతగా ఉన్న మంగళగిరికి చెందిన గంజి చిరంజీవి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆశిస్తున్న ఆయన.. గత ఎన్నికల్లో నారా లోకేష్ అక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది.. ఇక, లోకేష్ మంగళగిరిపై కేంద్రీకరించి పనిచేయడంతో.. తనకు ఆ స్థానం దక్కే అవకాశం లేకపోవడంతో.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. కానీ, ఏ పార్టీలో చేరతారు అనేది మాత్రం స్పష్టం చేయలేదు.. కానీ, ఇది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లానేనని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు.. అనుకున్నట్టుగానే.. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు గంజి చిరంజీవి… వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం కానున్న ఆయన.. సీఎం సమక్షంలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారట.
Read Also: Pallam Raju: కష్టకాలంలో కాంగ్రెస్‌ను వీడొద్దు.. వారికి ఇదే నా విజ్ఞప్తి..!
కాగా, 2014లో టీడీపీ నుంచి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన గంజి చిరంజీవి.. 2019 ఎన్నికల్లో ఆ స్థానాన్ని నారా లోకేష్ కోసం త్యాగం చేశారు.. స్థానికంగా బీసీ వర్గాల్లో మంచి పట్టు ఉన్న నాయకుడిగా గంజి చిరంజీవికి పేరు ఉండగా.. ఆయన్ని వైసీపీలోకి లాగేందుకు ఎమ్మెల్యే ఆర్కే.. ఈ స్కెచ్ వేశారనే ప్రచారం సాగుతోంది.. మొత్తంగా.. 20 రోజుల కిందట టీడీపీకి గుడ్ బై చెప్పిన గంజి.. ఇవాళ వైసీపీలో చేరబోతున్నారు. ఇక, మరోసారి తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతినిథ్యం వహిస్తోన్న కుప్పం సహా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచేది పార్టీ అభ్యర్థులే నంటూ వైసీపీ నేతలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.