ఏపీ రాజధాని అమరావతి విషయంలో వివాదం రేగుతూనే వుంది. వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేయడం మంచిది కాదని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు అన్నారు. ఇక్కడే ఇల్లు కట్టాను.. అమరావతిని అభివృద్ధి చేస్తానని సీఎం చెప్పలేదా..? ఎన్నికల ముందు మూడు రాజధానులని ఎందుకు అనలేదు..? అధికారం ఇచ్చారు కదా అని అడ్డగోలు నిర్ణయాలు చేస్తారా..? రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తే… న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదా..? అన్నారు గద్దె తిరుపతిరావు.
జగన్ గారూ.. ప్రజల ఆకాంక్షలు గౌరవించండి. రాజధాని అమరావతి వివాదానికి స్వస్తి పలకండి. రాజధాని అమరావతికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పోటీ పెట్టకండి. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచకండి. అమరావతిపై మాటల్లో ప్రేమ కాదు, చేతల్లో చూపండి. వికేంద్రీకరణపై వక్రభాష్యాలు వద్దు. గత ప్రభుత్వం తప్పులు చేస్తే సరిదిద్దండి, ప్రజలపై కక్ష సాధించకండన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు.
రాజధాని అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులకై కేంద్రంపై ఒత్తిడి తెండి. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇతర వ్యవస్థలపై నెపం నెట్టవద్దని హితవు పలికారు బాబూరావు.