తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అంత్యక్రియలు ఈరోజు ఢిల్లీలో జరగనున్నాయి. ఢిల్లీలోని కామరాజ్ మార్గ్‌లో ఉన్న బిపిన్ రావత్ ఇంటి వద్ద ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బిపిన్ రావత్ సహా ఘటనలో మృతి చెందిన 13 మందికి దేశమంతా నివాళులు అర్పిస్తోంది. బిపిన్ రావత్ భౌతికకాయానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, జాతీయ సలహాదారు అజిత్ ధోవల్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాళులు అర్పించారు.
అయితే హెలికాప్టర్ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో చనిపోయిన వారిని గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే డీఎన్ఏ పరీక్షలు చేసి ఫలితాలు వచ్చిన తర్వాత మృతదేహాలను వారివారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఏపీకి చెందిన సాయితేజ మృతదేహాన్ని కూడా అధికారులు ఇంకా గుర్తించలేదు. దీంతో సాయి తేజ భౌతికకాయం స్వగ్రామమైన చిత్తూరు జిల్లా రేగడివారి పల్లెకు ఎప్పుడు వస్తోందో తెలియని సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించేందుకు గత రాత్రి ఆర్మీ బృందం సాయి తేజ ఇంటికి వచ్చి తల్లిదండ్రులు, పిల్లల నుంచి రక్త నమూనాలు సేకరించి తీసుకెళ్లారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందచేయాలంటే ఒకట్రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. డీఎన్ఏ పరీక్షలు వీలుకాని పక్షంలో సాయి తేజ శరీరంపై ఉన్న గుర్తుల ద్వారా భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ఆలోచనలో ఆర్మీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.