ఏపీలో కొత్త జిల్లాల విభజనపై మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శలు చేశారు. వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఈరోజు దుర్దినం అని ఆయన అభివర్ణించారు. అప్పుడు రాష్ట్ర విభజన వల్ల ఎంత బాధపడ్డామో.. ఇప్పుడు జిల్లాల విభజన వల్ల అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ రెండు ఘటనలు ప్రజలకు చీకటి దినాలుగా నిలిచిపోతాయన్నారు. జిల్లాల విభజనతో వేమూరు నియోజకవర్గ ప్రజలకు తీరని నష్టం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేమూరుకు శతాబ్దాలుగా తెనాలితో ఉన్న అనుబంధం ఇప్పుడు విడిపోతుందన్నారు. వేమూరు నియోజకవర్గాన్ని కూతవేటు దూరంలో ఉన్న తెనాలిలో కాకుండా బాపట్లలో కలపడం దారుణమని నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు.
పార్లమెంట్ నియోజకవర్గం వారీగా జిల్లాలను ఏర్పాటు చేయడం దారుణమైన విషయం అని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. పార్లమెంట్ శాశ్వతం కాదని.. ఇప్పటికి మూడు సార్లు మార్చారని.. అలాగే భవిష్యత్‌లో జిల్లాలను కూడా మారుస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. వేమూరు నియోజకవర్గాన్ని బాపట్లలో కలిపే విషయంపై స్థానిక ఎమ్మెల్యే మేరుగు నాగార్జున నోరుమెదపకపోవడం వల్ల ఆయన చరిత్ర హీనుడిగా నిలిచిపోతారని నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. జగన్ పాలన విధ్వంసాలకు జిల్లాల విభజన తార్కాణంగా నిలుస్తోందని ఆయన మండిపడ్డారు.
https://ntvtelugu.com/governor-vishwa-bhushan-harichandan-about-new-districts/