తిరుమలలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఉచిత బస్సులో (శ్రీవారి ధర్మరథం) మంటలు చెలరేగాయి. శ్రీవారి సేవకులను బస్సులో తిరుపతి నుంచి తిరుమలకు తీసుకెళ్తున్న సమయంలో రెండో ఘాట్‌రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. అయితే మంటలను సకాలంలో గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును లింక్ రోడ్డు వద్ద నిలిపివేశాడు.
అనంతరం ఆ తర్వాత బస్సులోని శ్రీవారి సేవకులు వాహనం నుంచి దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బాధితులు ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల తిరుమల ఘాట్‌రోడ్డులో ఓ కారులోనూ మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.