గుంటూరు జిల్లా తాడికొండ సబ్‌స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అసని తుఫాన్ వల్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరిస్తున్నారు. దీంతో సబ్‌స్టేషన్‌లో మంటలు భారీగా చెలరేగడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తాడికొండ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు అసని తుఫాన్ కారణంగా ఏపీలోని పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా మోపిదేవి చల్లపల్లి, అవనిగడ్డ, ఘంటసాల మండలాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కరెంట్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అటు మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల్లో తుఫాన్ కారణంగా భారీగా ఈదురుగాలులు వీయడంతో పాటు భారీ వర్షం కురిసింది.

అసని తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని పలు చోట్ల భారీ వర్షం పడింది. గంపలగూడెం మండలంలో పలు చోట్ల కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు భారీ వర్షం కారణంగా వరి, మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏటీ గైరంపేటలో పిడుగుపాటుకు పాము రాంబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం పిడుగులతో పాటు భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో పొలంలో పశువులు మేపుతున్న రాంబాబు వర్షంతో చెట్టు నీడకు వెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అటు తుఫాన్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమై తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ మేరకు భీమవరం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ నెంబర్: 08816 299189
Asani Cyclone: తీవ్ర తుఫాన్‌గా ‘అసని’.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక