Vijayawada: దసరా పండగ సమయంలో ప్రత్యేక రైళ్లను నడపాల్సిన అధికారులు ఉన్న రైళ్లు రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కోసం విజయవాడ మీదుగా నడిచే వందలాది రైళ్లను రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కొన్ని రైళ్లను దారి మళ్లించారని.. విజయవాడ స్టేషన్‌కు వెళ్లకుండా రాయనపాడు, రామవరప్పాడు స్టేషన్లలో కొన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించారని ఓ మెసేజ్ తెగ సర్క్యులేట్ అవుతోంది. 9 9 రోజుల పాటు ఈ రైళ్ల రద్దు కొనసాగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. రైల్వే అధికారులపై మండిపడుతున్నారు.
Read Also:ఇండియాలో టాప్ 10 శీతాకాల పర్యాటక ప్రాంతాలు
విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా నిత్యం 300 రైళ్ల వరకు రాకపోకలు కొనసాగిస్తాయని.. ఈనెల 20 నుంచి 28 వరకు సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనులు జరుగుతుండటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. ముందస్తుగా 50 రైళ్లను రద్దు చేశారని.. మరికొద్ది రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు మెసేజ్‌లో పేర్కొన్నారు. అయితే విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ అధికారులే ఈ మెసేజ్‌ను తొలుత అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. తర్వాత ఇది ఫేక్ అంటూ నాలుక కరుచుకుని ఈ వార్త నమ్మవద్దని ప్రయాణికులను కోరారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ అవాస్తవమని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.