Face Recognisation App: సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ పేరుతో ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల్లోని పలువురు టీచర్లు సిద్ధం అవుతున్నారు. అయితే టీచర్ల హాజరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వారిని ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ యాప్ ద్వారా ఆందోళనల్లో పాల్గొనే టీచర్లను గుర్తు పట్టే ప్రయత్నాల్లో నిఘా వర్గాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అటు తాము ప్రతిపాదించిన జీపీఎస్ విధానంలో మార్పు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే మంత్రి బొత్స ప్రకటించారు. ఓపీఎస్ విధానంలోనూ కొంత మేర తగ్గడానికి ఉద్యోగులు అంగీకరించారని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 95 శాతం హామీలను మేర నెరవేర్చిందని.. నెరవేర్చని 5 శాతం హమీలల్లో సీపీఎస్ రద్దు అంశం ఒకటి అని తెలిపారు.
Read Also: Netflix New Feature : గేమర్స్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో మరో ఫీచర్
అటు విజయవాడలో సెప్టెంబర్ 1న తలపెట్టిన మిలీనియం మార్చ్‌పై నెల్లూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బాబురెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబురెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీనే నెరవేర్చాలని తాము కోరుతున్నామని.. పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులకు పోలీసుల ద్వారా నోటీసులు ఇప్పించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామన్నారు. సీపీఎస్ వల్ల ఉద్యోగులకు చాలా నష్టం కలుగుతుందన్నారు. రాజస్థాన్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సీపీఎస్ స్థానంలో ఓపీఎస్‌ను అమలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపులకు పోకుండా ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.