ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతోంది. ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాలు 11వ పీఆర్సీ కోసం క్షీరసాగర మదనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ సమీర్ శర్మపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ చేసిన కామెంట్లను ఐఏఎస్ అధికారుల సంఘం తప్పు పట్టింది. దీంతో ఏపీ ఐఏఎస్ అధికారుల అసోసియేషనుకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌంటర్ ఇచ్చింది. సీఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిలుకు ఛైర్మన్ హోదాలో సీఎస్ ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు.
కానీ సీఎస్ సమీర్ శర్మ ఆ బాధ్యతల్లో విఫలమయ్యారని వారు విమర్శించారు. అదే విషయాన్ని సూర్యనారాయణ చెప్పారన్నారు. సీఎస్ ను ఉద్దేశించి సూర్యనారాయణ చేసిన కామెంట్లు ఆయన వ్యక్తిగతం కాదని.. అది మా అసోసియేషన్ అభిప్రాయమని వారు వెల్లడించారు. సీఎస్ మీద ఇప్పటికీ ఆ అభిప్రాయానికే కట్టుబడి ఉన్నామన్నారు. ఐఏఎస్ అధికారుల సంఘం చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు.