కోనసీమ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నా.. చలో రావులపాలెం పిలుపుతో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు.. ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.. టూవీలర్లపై వస్తున్నవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.. అమలాపురంలోకి ఎంట్రీ ఇచ్చే వాహనదారులు వివరాలు మొత్తం సేకరిస్తున్నారు.. ఇక, రోడ్లపైకి వచ్చే ఆందోళన చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు.. అమలాపురంలో పరిస్థితి అదుపులోనే ఉందన్న ఆయన.. విధ్వంస చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆందోళన, విధ్వంస ఘటనల్లో పాల్గొన్న కొంత మందిని ఇప్పటికే గుర్తించడం జరిగిందని.. వారిపై చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.
Read Also: Karnataka: మరో జ్ఞానవాపిగా మంగళూర్ జుమా మసీద్… భారీ భద్రత ఏర్పాటు
ఇక, అమలాపురంలో సెక్షన్ 144, పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందని తెలిపారు డీఐజీ పాలరాజు.. పిల్లలను ఎవ్వరినీ తల్లిదండ్రులు బయటకు పంపవద్దు అని సూచించిన ఆయన.. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇక, ఇప్పటికే అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామని.. అన్ని నెట్‌వర్క్‌లకు సంబంధించిన ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయని.. పరిస్థితులు చక్కబడే వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు డీఐజీ పాలరాజు. కాగా, అమలాపురంలో నిన్న జరిగిన ఆందోళన, విధ్వంసం ఘటనల్లో పాల్గొన్నవారి వివరాలు సేకరించే పనిలో పడిపోయారు పోలీసులు.