Adulterated Milk: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనలో తాజాగా మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ళ శేషగిరిరావు, తాడి రమణి, తాడి కృష్ణవేణి, కనక రత్నం చనిపోయారు. అలాగే, మరో నలుగురు చిన్నారులు రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.
రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో స్థానికుల అస్వస్థత, మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షించారు. చౌడేశ్వరి నగర్లో ప్రజలు అనారోగ్యం పాలవ్వడం, పలువురు మరణించడంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్యసాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని చంద్రబాబు సూచించారు.
Read Also: Niharika : ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? అవార్డు వేడుక నిర్వాహకులపై మెగా డాటర్ నిహారిక ఫైర్!
ఇక, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో విక్రయదారులు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేస్తున్నారని సీఎం చంద్రబాబుకి అధికారులు వివరించారు. పాలు వినియోగించిన కుటుంబాల్లోని 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించారు. మిగిలిన అందరి నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పాల నమూనాల్లో ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Read Also: Baby Monkey: ఇంటర్నెట్ స్టార్ బేబీ మంకీ “పంచ్” కోసం.. రూ. 2 కోట్ల ఆఫర్..
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఇప్పటికే ఐదుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడింది.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలి.. వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి పెట్టి, బాధితులకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని జగన్ చెప్పారు.