Minister Nimmala: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనకు కులం రంగు పులిమి వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శవ రాజకీయాలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తుందని అన్నారు. ఇద్దరు వ్యక్తిగత గొడవలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ రెండు కులాలకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. నిందితుడ్ని ప్రభుత్వం ఏమైనా వెనకేసుకొచ్చిందా? అరెస్టు చేయకుండా ఆపిందా? అని క్వశ్చన్ చేశారు. కోడి గుడ్డుకి.. బోడి గుండుకి ముడి పెట్టినట్టు వైసీపీ వికృత చేష్టలకు, దిగజారుడు రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు ఛీ కొడుతున్నారు.. కాపులపై వైసీపీ ఒలకబోస్తున్న మొసలి కన్నీరు చూసి ఆ సామాజిక వర్గం నేతలే నివ్వెర పోతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
Read Also: Historical Diwali Stories: దీపాలు లేని దీపావళి.. ఈ గ్రామాల్లో ఆసక్తికరమైన దీపావళి చరిత్ర ..
ఆక, అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు తెలుగుదేశం పార్టీ కాపులకు చేసిన మేలు, ఆ సామాజిక వర్గం నేతల గుండెల్లో ఉందని మంత్రి నిమ్మల అన్నారు. కాపులకు రాజకీయ అధికారంలో అత్యధిక భాగస్వామ్యం కల్పించిన పార్టీ తెలుగుదేశమేనన్న సంగతిని గణాంకాలు చూస్తే వాస్తవాలు వెల్లడవుతాయి అన్నారు. పేటీఎం బ్యాచులతో, పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీ మీడియాతో కులాల మధ్య చిచ్చు పెట్టడం దేశద్రోహ కన్నా దారుణమని చెప్పుకొచ్చారు. విష ప్రచారాలు చేసే అసాంఘిక శక్తుల పైనా, వారిని వెనక ఉండి నడిపిస్తున్న వారి పైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, రాజకీయ ముసుగులో నేరగాళ్లు సృష్టించే వదంతులు, చేసే విష ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు మంత్రి నిమ్మల రామానాయుడు విజ్ఞప్తి చేశారు.
